1 Samuel 23

1తరువాత ఫిలిష్తీయులు కెయీలా మీద యుద్ధం చేసి కళ్ళాల మీద ఉన్న ధాన్యం దోచుకొంటున్నారని దావీదుకు తెలిసింది. 2అప్పుడు దావీదు, <<నేను వెళ్లి ఈ ఫిలిష్తీయుల్ని చంపమంటావా>>అని యెహోవా దగ్గర విచారణ చేస్తే, యెహోవా, <<నీవు వెళ్లి ఫిలిష్తీయుల్ని చంపి కెయీలాను కాపాడు>> అని దావీదుతో చెప్పాడు.

3దావీదుతో ఉన్నవారు, <<మేం ఇక్కడ యూదా దేశంలో ఉన్నప్పటికీ మాకు భయంగా ఉంది. కెయీలాలో ఫిలిష్తీయ సైన్యాలకు ఎదురుపడితే మాకు మరింత భయం గదా >>అని దావీదుతో అన్నారు. 4దావీదు మళ్ళీ యెహోవా దగ్గర విచారణ చేశాడు. <<నువ్వు లేచి కెయీలాకు వెళ్లు, ఫిలిష్తీయుల్ని నీ చేతికి అప్పగిస్తున్నాను>> అని యెహోవా చెప్పాడు.

5దావీదు, అతని అనుచరులూ కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని పూర్తిగా చంపేసి వారి పశువుల మందల్ని దోచుకున్నారు. ఈ విధంగా దావీదు కెయీలా నివాసుల్ని కాపాడాడు.

6దావీదు కెయీలాకు బయలుదేరితే అహీమెలెకు కొడుకు అబ్యాతారు ఏఫోదు చేత పట్టుకొని పారిపోయి అతని దగ్గరకు వచ్చాడు.

7దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని, <<దావీదు తలుపులూ, అడ్డుగడలు ఉన్న పట్టణంలో ప్రవేశించి అందులో చిక్కుకుపోయి ఉన్నాడు. దేవుడు అతణ్ణి నా చేతికి అప్పగించాడు >>అనుకొన్నాడు. 8అందుకే సౌలు కెయీలాకు వెళ్ళి దావీదునూ అతని అనుచరుల్నీ మట్టుబెట్టాలని తన సైన్యాన్ని యుద్ధానికి పిలిపించాడు. 9సౌలు తనకు కీడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని దావీదు గ్రహించి యాజకుడైన అబ్యాతారును ఏఫోదు తీసుకురమ్మన్నాడు.

10అప్పుడు దావీదు, <<ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను బంధించి పట్టణాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడని నీ దాసుడనైన నాకు కచ్చితంగా తెలిసింది. 11కెయీలా ప్రజలు నన్ను అతని చేతికి అప్పగిస్తారా? నీ దాసుడనైన నాకు తెలిసినట్టుగా సౌలు వస్తాడా? ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియజెయ్యి>> అని ప్రార్థిస్తే, <<అతడు వస్తాడు>> అని యెహోవా బదులిచ్చాడు.

12<<కెయీలా ప్రజలు నన్నూ నా ప్రజల్నీ సౌలు చేతికి అప్పగిస్తారా?>> అని దావీదు తిరిగి అడిగితే, యెహోవా, <<వారు నిన్ను అప్పగించాలని ఉన్నారు>> అన్నాడు.

13దావీదు, సుమారు 600 మంది అతని అనుచరులు లేచి కెయీలా నుండి వెళ్ళి అటూ ఇటూ తిరుగుతూ భద్రంగా ఉన్న స్థలాలకు చేరుకున్నారు. దావీదు కెయీలా నుండి తప్పించుకొన్న విషయం సౌలుకు తెలిసి వెళ్లకుండా మానుకున్నాడు.

14దావీదు సురక్షితమైన కొండ ప్రాంతంలో జీఫు ఎడారిలో ఉంటున్నాడు. సౌలు ప్రతిరోజూ అతణ్ణి వెదుకుతున్నప్పటికీ దేవుడు సౌలు చేతికి అప్పగించలేదు.

15తన ప్రాణం తీయాలని సౌలు బయలుదేరాడని తెలిసిన దావీదు హోరేషులో జీఫు అరణ్య ప్రాంతంలో దిగాడు. 16అప్పుడు సౌలు కొడుకు యోనాతాను తోటలో ఉన్న దావీదు దగ్గరకు వచ్చి, <<నా తండ్రి సౌలు నిన్ను పట్టుకోలేడు, నువ్వేమీ భయపడకు.

17నువ్వు తప్పక ఇశ్రాయేలీయులకు రాజు అవుతావు. నేను నీకు సహాయకునిగా ఉంటాను. ఈ విషయం నా తండ్రి సౌలుకు తెలిసిపోయింది>>అని అతనితో చెప్పి దేవుని పేరట అతణ్ణి బలపరిచాడు. 18వీరిద్దరూ యెహోవా సన్నిధానంలో ఒప్పందం చేసుకొన్న తరువాత దావీదు అక్కడే నిలిచిపోయాడు, యోనాతాను తన ఇంటికి వెళ్ళిపోయాడు.

19జీఫీయులు బయలుదేరి గిబియాలో ఉన్న సౌలు దగ్గరకు వచ్చి, <<యెషీమోనుకు దక్షిణ దిక్కులో ఉన్న హకీలా అడవిలోని కొండ స్థలాలలో మా ప్రాంతంలో దావీదు దాక్కొని ఉన్నాడు. 20రాజా, నీ కోరిక తీరేలా మాతో బయలుదేరు. రాజవైన నీ చేతికి అతణ్ణి అప్పగించడం మా పని >> అని చెప్పారు.

21సౌలు వారితో ఇలా అన్నాడు, <<మీరు నాపై చూపిన అభిమానాన్ని బట్టి యెహోవా మిమ్మల్ని దీవిస్తాడు గాక. 22మీరు వెళ్ళి అతడు దాగిన స్థలం ఏదో, అతణ్ణి చూసినవాడు ఎవరో కచ్చితంగా తెలుసుకోండి. అతడు ఎంతో చాకచక్యంగా ప్రవర్తిస్తున్నాడని నాకు తెలిసింది కాబట్టి 23మీరు ఎంతో జాగ్రత్తగా అతడు దాక్కొన్న ప్రాంతాల్ని కనిపెట్టిన సంగతి అంతా నాకు తెలియజేయడానికి మళ్ళీ నా దగ్గరకు తప్పకుండా రండి, అప్పుడు నేను మీతో కలసి వస్తాను. అతడు దేశంలో ఎక్కడ ఉన్నప్పటికీ యూదావారందరిలో నేను అతణ్ణి వెదకి పట్టుకొంటాను>> అని చెప్పాడు.

24వారు లేచి సౌలు కంటే ముందుగా జీఫుకు తిరిగి వెళ్లారు. దావీదు, అతని అనుచరులూ యెషీమోనుకు దక్షిణ వైపున ఉన్న మైదానంలోని మాయోను ఎడారి ప్రాంతంలో ఉన్నప్పుడు, 25సౌలు, అతని బలగమూ తనను వెదికేందుకు బయలుదేరారన్న మాట దావీదు విని, కొండ పైభాగంలోని మాయోను ప్రాంతంలో నివాసం ఏర్పరచుకొన్నాడు. ఆది విన్న సౌలు మాయోను ఎడారిలో దావీదును తరుమబోయాడు.

26కొండకు ఒకవైపు సౌలు, మరోవైపు దావీదు, అతని అనుచరులు వెళ్తున్నపుడు దావీదు సౌలు నుండి తప్పించుకుపోవాలని తొందరపడుతున్నాడు. సౌలు, అతని సైనికులు దావీదును, అతని అనుచరుల్ని పట్టుకోవాలని వారిని చుట్టుముడుతున్నారు. 27ఇలా జరుగుతున్నప్పుడు గూఢచారి ఒకడు సౌలు దగ్గరకు వచ్చి, <<నువ్వు త్వరగా బయలుదేరు, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరబడ్డారు>>అని చెబితే

28సౌలు దావీదును తరమడం మానుకొని ఫిలిష్తీయుల్ని ఎదుర్కొనడానికి వెనక్కి తిరిగి వెళ్ళాడు. కాబట్టి ఆ స్థలానికి సెలహమ్మలెకోతు
23:28 భయ విముక్తి శిల
అని పేరు పెట్టబడింది.

తరువాత దావీదు అక్కడనుండి వెళ్ళి ఏన్గెదీకి వచ్చి కొండ ప్రాంతలో నివాసం ఏర్పరచుకొన్నాడు.

29

Copyright information for TelULB